బీఆర్ఎస్కు మాజీ మేయర్ రాజీనామా.. త్వరలో కాంగ్రెస్‌లో చేరిక!

Byline :  Vijay Kumar
Update: 2024-02-25 13:32 GMT

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ సిద్ధాంతాలు నచ్చడంతో తాను 2019లో బీఆర్ఎస్ లో చేరినట్లు కృష్ణారెడ్డి లేఖలో తెలిపారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ గా ఎన్నికై ప్రజలకు సేవ చేశానని చెప్పుకొచ్చారు. కానీ కొంత కాలంగా పార్టీ నుంచి గానీ, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గానీ తమ ప్రాంతానికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని అన్నారు. పార్టీ కోసం నిరంతరం పని చేసే కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం లభించలేదని వాపోయారు. ఈ క్రమంలోనే తన సేవలు బీఆర్ఎస్ కు అవరసరం లేదని తనకు అనిపించిందని, తన ప్రాంతానికి మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతో తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ విషయంలో కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నానని అన్నారు. ఈ ఐదేళ్లు తనకు సహకరించిన పార్టీకి, కార్యకర్తలకు తీగల కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాగా తీగల కృష్ణారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 27న చేవెళ్లలో జరిగే సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో తీగల కృష్ణారెడ్డి, తీగల అనితా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వాళ్లు కూడా అదే రోజు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.




Tags:    

Similar News