Harish Rao : ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం: మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్ తీరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, హామీల అమలులో మాత్రం చలనం లేదని అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, కానీ ఆ పరిస్థితి మాత్రం కనబడటంలేదని అన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయిందని బాధపడొద్దని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని అన్నారు. కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు.
ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామన్నారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలువాలన్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం స్ఫూర్తినిచ్చేలా జరిగిందన్నారు. పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు, నాయకులు మంచి సూచనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం క్రమశిక్షణతో పనిచేయాలని సంకల్పించామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎన్నికల కోడ్ రాకముందే అమలయ్యేలా పోరాడాలని నిర్ణయించాన్నారు.