రాహుల్ జోడో యాత్రకు పోతే ఆ పార్టీలు చోడో యాత్రకు పోయాయి.. మాజీ మంత్రి మల్లారెడ్డి

Byline :  Vijay Kumar
Update: 2024-01-30 09:21 GMT

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు పోతే ఇండియా కూటమిలోని పార్టీలో చోడో యాత్రకు పోయాయని ఎద్దేవా చేశారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ను 100 అడుగుల గోతి తీసి పాతరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎంను పట్టుకొని బొంద పెడతామని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడారని అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేంత సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే ప్రజలు బొంద పెడుతారని అన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిపోతున్నాయని అన్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించగా.. నితీశ్ కుమార్ ఎన్డీఏలో జాయిన్ అయ్యారని తెలిపారు.

ఇక టీఎంసీ నేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీ రెండో సారి జోడో యాత్రకు పోతే ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూటమి నుంచి చోడో యాత్ర చేస్తున్నాయని సెటైర్లు వేశారు. కూటమిలో మిగిలింది రాహుల్ గాంధీ ఒక్కరేనని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని, ఆయన వచ్చాక రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని మల్లారెడ్డి అన్నారు.

Tags:    

Similar News