జనసేనతో పొత్తు ఉండదు..బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి

Byline :  Vijay Kumar
Update: 2024-01-02 10:34 GMT

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జనసేనతో ఎలాంటి పొత్తు ఉండబోదని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. అయితే ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామిగా ఉందని, అక్కడ మాత్రం పొత్తు కొనసాగుతుందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా జనసేనతో పొత్తు విషయం ఇంకా ఫైనల్ కాలేదని అన్నారు. త్వరలోనే ఆ అంశం కొలిక్కి వస్తుందని అన్నారు. కాగా 2023 నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో జనసేనకు బీజేపీ 8 సీట్లు కేటాయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, అశ్వరావుపేట, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలను జనసేనకు కేటాయించింది. అలాగే నాగర్ కర్నూల్, కోదాడ, కూకట్ పల్లి, తాండూర్ స్థానాలను కూడా జనసేనకే ఇచ్చేసింది బీజేపీ. అయితే తనకు కేటాయించిన 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కూడా సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తులేదని కిషన్ రెడ్డి ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Tags:    

Similar News