Gruha Jyothi scheme : గృహజ్యోతి పథకానికి మార్గదర్శకాలు విడుదల

Byline :  Vijay Kumar
Update: 2024-02-28 09:17 GMT

ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే రూ.10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం హామీలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిన్న రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ (గృహజ్యోతి) స్కీమ్ లను ప్రారంభించింది. తాజాగా గృహజ్యోతికి సంబంధించిన మార్కదర్శకాలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. అర్హత ఉన్నవాళ్లు ఏ విధంగా బిల్లు పొందాలో అందులో వివరించారు. ఒకవేళ అర్హత ఉన్నవాళ్లకు జీరో బిల్లు రాకుంటే ఏం చేయాలనే విషయాలను కూడా మార్గదర్శకాల్లో పొందుపరిచారు.

గృహజ్యోతి మార్గదర్శకాలు ఇవే..

.. ప్రజాపాలన కార్యక్రమంలో గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.

.. దరఖాస్తుదారులకు ఆధార్ అనుసంధానించిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి. సంబంధిత గృహ విద్యుత్తు కనెక్షన్ నెంబర్ ఉండాలి.

.. అద్దెకున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులు.

.. ఈ పథకం ద్వారా గృహ విద్యుత్తు కనెక్షన్ పై నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయం అమలవుతుంది.

.. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే అర్హత కలిగిన కుటుంబాలన్ని ఆ నెలలో జీరో బిల్లును అందుకుంటాయి.

.. ఈ పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 39.9 లక్షల కుటుంబాలు లబ్ది పొండుతాయి.

.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు గృహ విద్యుత్తు కనెక్షన్ నెంబర్ తో పూర్తి వివరాలు సమర్పించిన కుటుంబాలన్నీ ఈ ప్రయోజనాన్ని అందుకుంటాయి.

.. 2024 మార్చి నుంచి లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేస్తారు.

అర్హతలుండీ జీరో బిల్లు రాని కుటుంబాలు అనుసరించాల్సిన పద్ధతులు:

.. అర్హతలున్నప్పటికీ జీరో బిల్లు పొందని గృహ వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయముంది.

.. మండల ఆఫీసు లేదా మునిసిపల్ కార్యాలయాల్లో గృహ జ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. తెల్ల రేషన్ కార్డు, లింక్ చేయబడిన ఆధార్, గృహ విద్యుత్తు కనెక్షన్ నెంబర్లను సమర్పించాలి.

.. అర్హులని గుర్తించినట్లయితే, వారు సవరించిన బిల్లును జారీ చేస్తారు. ఈ పథకానికి అర్హుల జాబితాలో నమోదు చేస్తారు.

.. అర్హతలున్న వినియోగదారులు దరఖాస్తులను ధ్రువీకరించుకునే అవకాశం కల్పించినందున, వారి నుంచి బిల్లు రికవరీ చేయడానికి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరు.

Tags:    

Similar News