గద్దరన్న జీవితం ఓ పోరాటం.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

Byline :  Vijay Kumar
Update: 2024-01-31 11:54 GMT

గద్దరన్న జీవితం ఓ పోరాటమని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయనకు నివాళి అర్పించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ లేఖ విడుదల చేశారు. అనేక ప్రజా యుద్దాల్లో ఆరితేరిన యోధుడు అనే మాటలు ప్రజాయుద్ధ నౌక, దివంగత గద్దర్ కి అన్వయించడం అతిశయోక్తి కాబోదని అన్నారు. పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన యానం సాగించిన విప్లవకారుడు గద్దర్ అని అన్నారు. ప్రజల మాటలను పాటలుగా కూర్చి, ఆ పాటలనే తూటాలుగా పేర్చి జనం కోసం జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు గద్దర్ అని అన్నారు. ఎప్పుడు కలిసినా తమ్ముడా అంటూ పలకరించే ఆయన పలకరింపు తన గుండెకు చేరువుగా గోచరిస్తుందని అన్నారు. యువతకు నేడు తన నాయకత్వం అవసరం అని ఆయన చివరి క్షణాలలో చెప్పిన మాటలు తనలో ఎల్లప్పుడూ మారుమోగుతుంటాయని పవన్ అన్నారు.

కాగా నేడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ కు ఘనమైన నివాళి అర్పించింది. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్‌ చనిపోయిన సమయంలో రాజకీయ పార్టీలు స్పందించిన తీరు అప్పట్లో తీవ్రమైన చర్చకు దారి తీశాయి. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. గద్దర్ అంతిమయాత్రలో అన్నీ తానై ముందుకు నడిపించారు.

Tags:    

Similar News