కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంపైన కాంగ్రెస్ మంత్రులు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వాస్తవాలు బయటపడ్డాయని అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని గతంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. కానీ కాళేశ్వరానికి రూ.93 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టినట్లు అధికారులు తెలిపారని అన్నారు. కాళేశ్వరానికి పెట్టిన ఖర్చు విషయమై కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకుందని అన్నారు. రూ.93 వేల కోట్లు ఖర్చుపెడితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేశారని అన్నారు. కానీ కాళేశ్వరం ద్వారా 98 వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు అధికారులు చెప్పారని అన్నారు. 14 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని అన్నారు.
అనేక రిజర్వాయర్ల నిర్మాణం వల్ల వ్యయం పెరిగిందని అన్నారు. దాదాపు 6 లక్షల ఎకరాలకు ఆయకట్టును పెంచామని అన్నారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగడం దురదృష్టకరమని అన్నారు. విచారణ తర్వాత దోషులను శిక్షించాలని కోరుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరగాలి అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వాస్తవాలు తెలిపినందుకు ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు. శ్వేత పత్రాలు, న్యాయ విచారణలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.