60 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు.. Kadiyam Srihari

Byline :  Vijay Kumar
Update: 2024-02-13 10:25 GMT

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేసిందని, రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ భవన్ నుంచి "ఛలో నల్గొండ" బహిరంగ సభకు బయలుదేరే ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకే తామంతా నల్గొండకు బయలుదేరి వెళ్తున్నామని అన్నారు. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు నెలల్లోనే కృష్ణా, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని అన్నారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మా పార్టీ వివరంగా గళం ఎత్తిందని అన్నారు.

నదీ జలాల పరిరక్షణ కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచిందని, నిన్న అసెంబ్లీలో అబద్దాలను ప్రచారం చేసిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియని చెప్పాల్సిన అవసరం తమపై ఉన్నదని అన్నారు. ఈరోజు తమ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ప్రజలకు నది జలాల పైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాల పైన సభలో వివరిస్తారని అన్నారు. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోమన్నారు. ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని కడియం శ్రీహరి అన్నారు.

Tags:    

Similar News