తెలంగాణ ఠీవీ పీవీ అని మాజీ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం పీవీకీ తాజాగా భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. తమ కృషి వల్లే ఇవాళ పీవీకి భారతరత్న వచ్చిందని అన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు అని అన్నారు. పీవీ నరసింహరావును బీఆర్ఎస్ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించిందని అన్నారు. ఏడాదిపాటు ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని అన్నారు. రాజధాని నడిబొడ్డున ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ఆయన కూతురు సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ ఇచ్చామని అన్నారు.
కాగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో ముగ్గురు ప్రముఖులకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారాన్నిప్రకటించింది. దీంతో పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు దేశంలోని పలువురు ప్రముఖుల నుంచి వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారతరత్న అవార్డుకు ఎంపికైన వాళ్లకు శుభాకాంక్షలు తెలపగా.. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా విషెస్ చెప్పారు.