తాను జన్మించిన సొంత గడ్డలోనే కొమురం భీమ్ కు అవమానం జరుగుతోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం అంబగట్టలో ఆదివాసుల పోరాటయోధుడు కొమురం భీమ్ విగ్రహన్ని ఆయన ఆవిష్కరించారు. కొమురం భీమ్ పుట్టిన గడ్డపైనే ఆయన పోరాడి సాధించిన హక్కులకు ఆధిపత్య పాలకులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. పెసా చట్టం, 1/70, జీవో నెం.3 లాంటి హక్కులను, చట్టాలను ఆదివాసీలకు దక్కకుండా పాలక ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఇందుకేనా కొమురం భీమ్ ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది అని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్ లో పొందుపరచిన హక్కులతోపాటు జల్, జంగిల్, జమీన్‌పై సంపూర్ణ అధికారం ఆదివాసీలకు దక్కితేనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ఆదివాసీల గొంతుకై బీఎస్పీ నిరంతరం పోరాడుతోందని అన్నారు.