6 గ్యారెంటీలపై చేతులెత్తేసిన సీఎం.. మాజీ మంత్రి కేటీఆర్

Update: 2024-02-02 10:16 GMT

ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తాశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభకు కేటీఆర్‌ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలన్నారు. ఎన్నికల సమయంలో గెలవగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ఇండియా కూటమి నుంచి ఇప్పటికే చాలా పార్టీలు బయటకు వెళ్లిపోయాయని అన్నారు. కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టడం ప్రాంతీయ పార్టీల వల్లనే అవుతుందని అన్నారు. మాయమాటలు చెప్పి రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారని, 420 హామీలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అప్పు తెచ్చుకోండి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారని, కానీ ఇంత వరకు వాటిని అమలు చేయలేదని అన్నారు.

ఇక ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారని, కానీ దీనివల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారని అన్నారు. ఈ పథకంతో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడ్డారని, కడుపు కాలిన ఓ ఆటోడ్రైవర్‌ ప్రజాభవన్‌ ముందే తన ఆటోను కాలబెట్టారని అన్నారు. బీఆర్‌ఎస్‌ను పాతిపెడతానని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని, రేవంత్‌ లాంటి వాళ్లనెంతో మందిని కేసీఆర్‌ చూశారని అన్నారు. పార్టీ కార్యకర్తలెవరికీ అన్యాయం జరిగినా పార్టీ అగ్రనాయకత్వం, పార్టీ ప్రజాప్రతినిధులు వస్తారని, ఎవరూ కూడా అధైర్యపడొద్దని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఇందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. ఢిల్లీలో తెలంగాణ హక్కులను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్న కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.




Tags:    

Similar News