ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గురువారం ఆటో యూనియన్ లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ద ప్రకాష్ తో పాటు ఆటో డ్రైవర్స్ జేఏసీ తో పాటు వివిధ సంఘాల డ్రైవర్లు పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని ద్వారా ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల వద్దకు బస్సులు వెళ్ళవని, బస్సుల వద్దకే ప్రయాణికులు వస్తారని తెలిపారు.
ఆటోల్లొ కూడా ప్రజలు ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు బీఆరెస్ ట్రాక్ లో పడొద్దని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత ఏడాది 22 వేల ప్రమాదాలు జరిగాయని, 3 వేల మంది ప్రమాదంలో చనిపోయారని రోడ్డు సేఫ్టీ విషయంలో అందరు జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వంపెండింగ్ లో ఉన్నా ట్రాఫిక్ చలాన్ ల పై 80 శాతం రాయితీ ఇచ్చిందని గుర్తు చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు అనేది తమ ప్రభుత్వ విధానమే తప్ప తాము ఆటో కార్మికులకు వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అనంతరం ఆటో యూనియన్ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించినట్లుగా ఈఎస్ఐతో కూడిన ఆటో మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం అందించాలని, గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా ఆట లకు పర్మిట్లు ఇవ్వాలని కోరారు. ఆటో మీటర్ చార్జీలను పెంచాలని, ఆటోలకు ఇన్సూరెన్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 50 సంవత్సరాలు నిండిన గీతా , నేత కార్మికుల మాదిరి ఆటో డ్రైవర్లకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. అక్రమంగా నడుస్తున్న ఓలా, ఉబెర్ లను, టూ విలర్లను నిషేధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.