రాష్ట్రాభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్

Update: 2024-01-19 10:17 GMT

రాష్ట్రాభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. జడ్చర్లలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గత ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించిందని, వాళ్లను దారుణంగా మోసం చేసిందని అన్నారు. అక్రిడేషన్ కార్డులు ,హెల్త్ కార్డులు , ఇళ్ల స్థలాలు , ఉచిత విద్యలో జర్నలిస్టులను గత ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులపై తీవ్రమైన ఆంక్షలు ఉండేవని అన్నారు. ప్రెస్ అకాడమీకి సమర్థవంతమైన చైర్మన్ నియమించి భవిష్యత్ లో జర్నలిస్ట్ ల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే తప్పులను తమ దృష్టికి రావాలని, అంతేగానీ ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వంపై బురద చల్లేలా రాయవద్దని జర్నలిస్టులను కోరారు. బీఆరెస్ అధికారిక పత్రికలో గత వారం రోజులుగా ప్రభుత్వం మీద అపోహలు రాస్తున్నారని అన్నారు. ఎరువులు కొరత లేకున్నా ఉందని.. హైదరాబాద్ నగరంలో నీటి, విద్యుత్ కొరత ఉందని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

గత 10 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేకుండా నియంత్రుత్వంగా అధికార వికేంద్రీకరణ బదులు ప్రగతి భవన్ కేంద్రంగా పరిపాలన కొనసాగిందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అనుగుణంగా నడిచే పరిపాలన శకం ప్రారంభమైందని అన్నారు. ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెలను తొలగించి సీఎం కార్యాలయానికి రావడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించామని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అన్ని సమస్యలు ఒకే రోజు పరిష్కారం కావని అన్నారు. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధించి ఉంటే ప్రజా పాలన కు కోటి 5 లక్షల అప్లికేషన్లు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు.


Tags:    

Similar News