మా పాలనలో విపక్షాల గొంతు నొక్కే పరిస్థితి ఉండదు.. Minister Ponnam Prabhakar

Byline :  Vijay Kumar
Update: 2024-01-30 12:42 GMT

కాంగ్రెస్ పాలనలో విపక్షాల గొంతు నొక్కే పరిస్థితి ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేటతో తనకు విడదీయరాని బంధం ఉందని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతంతో బంధం ఏర్పడిందని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశానని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల వద్దకు విపక్ష నాయకులు పోయే పరిస్థితి లేదని, ఒకవేళ వెళ్లినా అక్రమంగా అరెస్ట్ చేసేవారని అన్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరికి కూడా ప్రజలను రానిచ్చేవారు కాదని అన్నారు. కానీ తమ పాలనలో అలా ఉండదని, సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. తమ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ కంచెలు తొలగించి దానిని ప్రజా భవన్ గా మార్చామని అన్నారు. ప్రజా పాలనకు కోటి 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు. ఇప్పటి వరకు 12 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. కావాలనే ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని, దమ్ముంటే మహిళలకు ఈ పథకం అవసరం లేదని చెప్పాలని సవాల్ విసిరారు. త్వరలోనే కొత్త బస్సులు వస్తున్నాయని, అలాగే కొత్త రూట్లలో కూడా బస్సులు నడుపుతామని అన్నారు. 317 జీవో సమస్యలున్నాయని, అయితే వాటిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశఖారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. ప్రభుత్వం నుంచి దిగిపోగానే బీఆర్ఎస్ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారని, కానీ వాళ్లను పట్టించుకునే పరిస్థితి ప్రజల్లో లేదని అన్నారు.

Tags:    

Similar News