అహంకారానికి బ్రాండ్ అంబాసిడరే మీరు.. కేటీఆర్పై మంత్రి సీతక్క ఫైర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 'కనకపు సింహాసనమున శుకము... వినుర సుమతీ' అనే పద్యాన్ని ఇవాళ కేటీఆర్ ట్వీట్ చేశారు. దానికి మంత్రి సీతక్క అదే ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రతి మాటా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు. అహంకారానికి బ్రాండ్ అంబాసిడరే కేటీఆర్ కుటుంబం అని మండిపడ్డారు. 'దొర'హంకారానికి ప్రతిరూపం బీఆర్ఎస్ పాలన అయితే.. ప్రజాపాలనకి నిలువెత్తు నిదర్శనం తమ పాలన అని అన్నారు. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగు కప్పుకొని, అధికారంలోకి వచ్చాక ప్రజలని బానిసల కంటే హీనంగా చూసిన చరిత్ర కేటీఆర్ కుటుంబానిది అని అన్నారు.
అందుకే తెలంగాణ ప్రజలు కేటీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పారని సీతక్క అన్నారు. కాగా గురువారం మీడియాతో మాట్లాడిని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలకులు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని, అందువల్లే రాష్ట్రం అప్పల పాలైందని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పు పాతాళంలో పాతేస్తామని, ఆ పార్టీ పతనం మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూ కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ లో సుమతీ పద్యాన్ని షేర్ చేశారని చర్చ నడుస్తోంది.