Sridhar Babu : ఆరు గ్యారెంటీల అమలు దిశగా అడుగులు.. మంత్రి శ్రీధర్ బాబు

Byline :  Vijay Kumar
Update: 2024-01-23 13:05 GMT

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర మంత్రి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో మంగళవారం మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు. అందుకే ఎన్నికల సమయంలో మంచి మేనిఫెస్టోను అందించామన్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను పొందుపరిచామని... వాటిని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజునే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలపై విపక్షాలు రకరకాలుగా దుష్ఫ్రచారం చేస్తున్నాయని, వాటిని ప్రజలు పట్టించుకోరని అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఎంతో విశ్వాసం చూపించారన్న మంత్రి.. వారికి ఇచ్చిన మాట ప్రకారం పథకాలు ఇచ్చి తీరుతామన్నారు. మాట ఇచ్చినట్లుగానే అనుకున్న సమయంలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ ఖాన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మేనిఫెస్టో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Tags:    

Similar News