రేషన్ బియ్యం పెద్దగా ఎవరూ తినడం లేదు.. మంత్రి తుమ్మల

Byline :  Vijay Kumar
Update: 2024-02-04 16:02 GMT

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యాన్ని పెద్దగా ఎవరూ తినడం లేదని అన్నారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌ వేదికగా ఈ ఏడాది జూన్ 4 నుంచి 6 వరకు జరగనున్న గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యం పెద్దగా ఎవరూ వాడటం లేదని, ఎగుమతులకు సంబంధించిన రైస్ పాలసీ మీద పునరాలోచన చేయాలని కోరారు. భారత్ రైస్ 29 రూపాయలకే కేజీ అనేది హాస్యాస్పదంగా ఉంది. రూ.29లకే సన్న బియ్యం అందిస్తే హర్షణీయమని అన్నారు. ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని ‘భారత్ రైస్’ పేరిట రూ.29 కేజీ అందిస్తే ఎలా అని ప్రశ్నించారు.తెలంగాణ దేశానికే కాదు ప్రపంచానికే అన్నం పెడుతోందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో వ్యవసాయం 60 శాతం వరి పంటపైనే ఆధారపడిందని అన్నారు. తెలంగాణలో పంటలకు బీమా అవసరమని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు.

ఈ ఖరీఫ్ నుంచి పంటలకు బోనస్ అందించే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఉద్యానవన పంటలు వేయాలని రైతులను కోరారు. కేంద్రం బియ్యం ఎగుమతులను నిషేధించడంతో తెలంగాణ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేసినా దేశంలో రేట్లు పెరగకుండా కేంద్రం పర్యవేక్షించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఏ దేశానికి ఏ రకం బియ్యం అవసరమో కేంద్రం ముందే సమాచారం ఇస్తే ఆ రకాన్ని రైతులు పండించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తద్వారా ఎగుమతులు సులభతరం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం ఆలోచించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News