కేసీఆర్ ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేశారు.. Minister Uttam
కేసీఆర్ తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేశారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులో విషయంలో కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. పాలమూరు రంగారెడ్డి-రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.27,560 కోట్లు ఖర్చుపెట్టిందని, కానీ ఆ ప్రాజెక్టుతో కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరానికి రూ.95 వేల ఖర్చు చేస్తే కనీసం లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టుకు రూ.7500 కోట్లు ఖర్చు చేస్తే ఏమాత్రం ఫలితాలు రాలేదని అన్నారు. ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ కు మాట్లాడే హక్కులేదని అన్నారు. కృష్ణా నది ద్వారా తెలంగాణకు గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్లలో రోజుకు 8టీఎంసీల నీళ్లను ఏపీ సీఎం జగన్ తరలించుకుపోతుంటే కేసీఆర్ కనీసం నోరు కూడా మెదపలేదని అన్నారు. కానీ రెండు టీఎంసీల నీళ్ల కోసం లక్షకోట్ల రూపాయల దాక ఖర్చుపెట్టి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని అన్నారు. కాళేశ్వరం మెయింటెనెన్స్ కే ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు వస్తోందని అన్నారు. ఇంతకంటే తుగ్లక్ పని ఇంకా ఏమైనా ఉంటుందా అని అన్నారు.
తెలంగాణకు రావాల్సిన 8 టీఎంసీల నీళ్లను ఏపీకి తరలించుకుపోయేందుకు కేసీఆర్ నాడు ఏపీ సీఎం జగన్ తో కలిసి కుట్రలకు పాల్పడ్డారని అన్నారు. అందులో భాగంగానే జీవో 203 తెచ్చారని ఆరోపించారు. తాము ఎలాంటి ప్రాజెక్టులను అప్పగించడం లేదని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు అప్పగించేంది లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి శాసన సభలో అన్ని విషయాలు చర్చకుపెడతామని అన్నారు. గత పదేండ్లలో జరిగిన అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదని అన్నారు. కేసీఆర్ దొంగ నాటకాలను గమనించాలని రాష్ట్ర ప్రజలను మంత్రి ఉత్తమ్ కోరారు.