Venkat Reddy : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. కన్నీరు పెట్టిన మంత్రి కోమటిరెడ్డి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే తలకు తీవ్ర గాయమై మృతిచెందారంటూ వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇటీవల ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలందరికీ తనదే ఒకటే విన్నపమని మంత్రి అన్నారు.
ప్రజా కార్యక్రమాలకు సంబంధించి బిజీ షెడ్యూల్ వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు స్పీడుగా వెళ్తుంటారని.. కానీ సీటు బెల్టు పెట్టుకోకపోవడం, స్పీడ్ లిమిట్ పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. ఇటీవల నల్గొండ సభకు హాజరై వస్తుండగా ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం గురైందని, కానీ ఆమె క్షేమంగా బయటపడ్డారని అన్నారు. అలాగే ఓ ఫంక్షన్ కు అటెండ్ అయ్యే క్రమంలో లిఫ్ట్ లో ఇరుక్కొని లాస్య చాలా ఇబ్బందిపడ్డారని అన్నారు. ఇలా రెండు ప్రమాదాల నుంచి తప్పించుకున్న లాస్య నందిత మూడో ప్రమాదంలో మాత్రం తప్పించుకోకలేకపోయారని బాధను వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం చాలా బాధాకరమని, ఆమె కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
నాడు రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి తనయుడి మృతి
ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించడం నాడు తెలుగు రాష్ట్రాలను తీవ్ర విషాదం నింపింది. 19 డిసెంబర్ 2011న పటాన్‌చెరుకు స్నేహితులతో కలిసి ప్రతీక్ రెడ్డి కారులో వెళ్తున్నాడు. అత్యంత వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితోపాటు మరో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. అలాగే అదే రోడ్డుపై సినీ నటుడు కోట శ్రీనివాస్ రావు తనయుడు వెంకటసాయి ప్రసాద్ , కాంగ్రెస్ నేత, ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తనయుడు మహ్మద్ అయాజుద్దీన్, రవితేజ సోదరుడు భరత్ కూడా మృత్యువాత పడ్డారు.