తెలంగాణ తల్లి విగ్రహాన్ని మా ప్రభుత్వం చేయలేదు.. సీఎంకు పల్లా కౌంటర్

Update: 2024-02-09 14:09 GMT

తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని, శిల్పులు చేశారని సెటైర్లు వేశారు. ఉద్యమ సమయంలో అసలు కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నారని అన్నారు. జయజయమే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో నేటి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు శిబిరంలో ఉన్నారని అన్నారు. గద్దర్ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని చూస్తోందని, అందుకే గద్దర్ పేరు మీద అవార్డుల పేరుతో డ్రామాలాడుతున్నారని అన్నారు. తమ హయాంలోనే ఉద్యమకారులకు, కళాకారులకు సముచిత స్థానం కల్పించామని, గోరెటి వెంకటన్న లాంటి కళాకారులకు ఎమ్మెల్సీ ఇచ్చామని అన్నారు. ఒక జిల్లాకు.. యూనివర్సిటీకి జయశంకర్ సార్ పేరు పెట్టామని, పీవీ పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేశామని అన్నారు. ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, కళాకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించిందని అన్నారు.

శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను ఎమ్మెల్యేగా నిలబడితే కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడగొట్టింది నిజం కాదా అని నిలదీశారు. జయజయహే తెలంగాణ గేయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దాన్ని రాష్ట్ర గీతంగా చేద్దామని నాటి ప్రభుత్వం ప్రయత్నిస్తే.. ఆ పాటలో పది జిల్లాలు ఉన్నాయి.. కొన్ని మార్పులు చేద్దామని రచయిత అందెశ్రీ చెప్పారని అన్నారు. రాజముద్రలో చార్మినార్, కాకతీయుల చిహ్నాలను పెట్టడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం తమకు లేదని అన్నారు. హైదరాబాద్ సంస్కృతికి చార్మినార్ చిహ్నం అని, అలాగే గొలుసుకట్టు చెరువులతో తెలంగాణలో అద్భుతమైన పంటలు పండించిన చరిత్ర కాకతీయులదని.. ఈ క్రమంలోనే ఆ రెండింటిని రాష్ట్ర రాజముద్రలో వాడామని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత గల ప్రతిపక్షంగా తాము అన్ని విధాల సహకారం అందిస్తున్నామని, కానీ తమపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని అన్నారు.



Tags:    

Similar News