విద్యార్థిని ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. MLC Kavitha
సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె అస్మిత ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదవుతోంది. కాగా ఈ నెల 10న అదే గురుకుల స్కూల్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ చదవుతున్న విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈనేపథ్యంలో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజులపాటు హోం సిక్ సెలవులు ఇచ్చారు. దీంతో అస్మిత తన ఇంటికి వచ్చింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన అస్మిత ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్ది కాలం వ్యవధిలోని ఆత్మహత్య చేసుకోవడం బాధాకారం అని అన్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోంది ? విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ? అని కవిత ప్రశ్నించారు. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని అన్నారు. తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కవిత కోరారు.