రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో మర్యాదపూర్వక భేటీయైన కృష్ణయ్య ఆయనతో కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. ఇటీవల కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం పదవులు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు న్యాయం చేయాలని, డిప్యూటీ సీఎంతో పాటు ఐదు మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్. కృష్ణయ్య భేటీ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.