కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి.. క్లారిటీ ఇదే

Update: 2024-02-02 11:45 GMT

నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మర్రి జనార్ధన్ రెడ్డి పార్టీ మారబోతున్నారని, ఆయన త్వరలోనే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఇవాళ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మర్రి జనార్ధన్ రెడ్డి స్పందించారు. అదంతా వట్టి ప్రచారమేనని, ఆ అసత్య ప్రచారాన్ని తాను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా మీడియా సృష్టించిన గోబెల్స్ ప్రచారం మాత్రమేనని, తాను ఎవరితోను పార్టీ మారతానని ఇప్పటివరకు చెప్పలేదని అన్నారు. తాను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తనకు దైవంతో సమానమని, ఆయనకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోనని అన్నారు. పార్టీ మారాల్సి వస్తే కేసీఆర్‌కు, తన నియోజకవర్గ ప్రజలకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లబోనని.. అయినా తనకు పార్టీ మారే ఆలోచన లేదని మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు.

కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతిలో మర్రి జనార్ధన్ రెడ్డి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ టికెట్‌ కష్టమేనని భావిస్తున్నందుకే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ ఓకే అంటే కాంగ్రెస్ తరఫున మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని టాక్. అయితే మర్రి జనార్ధన్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న సమాచారంతో నాగర్‌ కర్నూలు జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో పడ్డారు.




Tags:    

Similar News