అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్ మార్పు.. వ్యతిరేకించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాల తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చేశారు. కాగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్ ను మారుస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్ లాబీలోని చిన్న గదిలోకి మార్చేసింది. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఛాంబర్‌ను మార్చారంటూ అసెంబ్లీ లాబీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రతిపక్ష కార్యాలయం కంటే ఇప్పుడు ఇచ్చినది చాలా చిన్నదిగా ఉందని అన్నారు. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్‌ను కేటాయించిందని అన్నారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన ఛాంబర్‌ను రెండో సమావేశాల్లోపే మార్చేసిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. తమకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినా తమను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని అన్నారు.
అసెంబ్లీ చరిత్రలో ఏనాడు ఓ ప్రతిపక్ష నేతకు ఇంత అవమానం జరగలేదని అన్నారు. ప్రతిపక్ష నేతకు ఇచ్చిన చాంబర్ ను స్పీకర్ కు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సభ్యులే ఉన్నా కూడా తమ ప్రభుత్వం ఇన్నర్ లాబీలోనే విపక్ష నేతకు చాంబర్ కేటాయించామని అన్నారు. కేసీఆర్ కు కేటాయించిన చాంబర్ విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్లు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనల గురించి ప్రశాంత్ రెడ్డి స్పీకర్ కు వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ఓడిపోయని కాంగ్రెస్ నేతలకు ప్రోటోకాల్ కల్పిస్తున్నారని అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పోలిస్ ఎస్కార్ట్ వెహికల్ ఇస్తున్నారని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్లు ఆయన తెలిపారు.