CM Revanth Reddy : సీఎం మాటలకు కంటతడి పెట్టుకున్న దాసరి కొండప్ప
పద్మ అవార్డులు అందుకున్న తెలుగువాళ్లకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం సన్మాన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. అలాగే పద్మ విభూషణ్ కు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవితో పాటు పద్మశ్రీ అవార్డు సెలక్టైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, కేతావత్ సోమ్ లాల్, ఆనందా చారి,కూరెళ్ల విఠలాచారిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్ పద్మశ్రీ పొందిన కళాకారుల గురించి మాట్లాడుతుండగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన తెలంగాణకు చెందిన బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప కంటతడి పెట్టారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25 లక్షల పురస్కారాన్ని ప్రభుత్వం తరుపున అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి నెల రూ.25 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం ఈ ప్రకటన చేయగానే దాసరి కొండప్ప చాలా ఎమోషనల్ అయ్యారు. తనకు నచ్చిన కళ కోసం జీవితాన్ని అర్పించిన వ్యక్తి దాసరి కొండప్ప అని సీఎం అన్నారు. కడు పేదరికాన్ని అనుభవిస్తున్నా నచ్చిన కళ కోసం నిత్య శ్రమించిన వ్యక్తి దాసరి కొండప్ప అని అన్నారు. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం రావడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ లో సన్మానాన్ని అందుకోవడానికి కనీసం దారి ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితుల్లో దాసరి కొండప్ప ఉన్నారని, అందుకే అలాంటి కళాకారులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించగానే దాసరి కొండప్ప కన్నీటిపర్యంతమయ్యారు.