'సిరిసిల్ల గోడు పత్రం' రిలీజ్ చేయండి.. కేటీఆర్పై రాణి రుద్రమ ఫైర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ ఫైర్ అయ్యారు. స్వేద పత్రం పేరుతో కేటీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. స్వేద పత్రం కాదు.. సిరిసిల్ల ప్రజల గోడు పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి నాగలి కట్టి, అరక దున్ని, చెమటోడ్చి , ఎవుసం చేసి పంట పండించినట్టు స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రాష్ట్రం పరిస్థితి పక్కన పెడితే 14 ఏళ్లుగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఆ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ బంధువుల ఇసుక మాఫియాపై.. అలాగే ఇసుక టెండర్లు ద్వారా ఇప్పటి దాక ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో చెప్పాలని అన్నారు. నేరెళ్ల దళితుల బాధలకు కారణం ఎవరో కూడా చెప్పాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో అగ్రహారం అంజన్న మట్టిని దోచుకుంటున్న దొంగలపై ఒక మైనింగ్ మాఫియా పత్రం సిరిసిల్లలో రిలీజ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు కట్టిన 42 చెక్ డ్యామ్ లలో 22 డ్యామ్ లు ఒక్క వానకే ఎందుకు కూలిపోయాయో, ఇంకా ఆ కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదో ఒక అవినీతి పత్రాన్ని రిలీజ్ చేయాలని అన్నారు. సెస్ లో 40 కోట్ల కుంభకోణం చేసి ఫైళ్లు తగలపెట్టిన వారెవరో బయటకు తీసి సిరిసిల్లలో అవినీతి దొంగల చిట్టా పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల పేరుతో MAC సంఘాల రిజిస్టర్లు, చెక్ బుక్కులు సంఘాలు కార్మికుల వద్ద లేకుండా ఎవరు లాక్కుని ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని, నేత కార్మికుల కష్టాన్ని దోచుకున్న బతుకమ్మ చీరల అవినీతి బాగోతం పత్రాన్ని సిరిసిల్ల లో రిలీజ్ చేయాలని రాణి రుద్రమ డిమాండ్ చేశారు.