వీఆర్ఏలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవిన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు సభ్యులు గల ఈ కమిటీలో పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. రెవిన్యూ శాఖ ముఖ్య కార్శదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నియమించిన అధికారి, జీఏడీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా.. సీసీఎల్ఏ కార్యదర్శి కమిటీ కన్వీనర్ గా ఉన్నారు. వీఆర్ఏలకు సంబంధించిన అంశాలపై వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, చట్టపరిమితి, న్యాయవివాదాలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించనున్నదని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకురాగా.. వీఆర్ఓలు, వీఆర్ఏలు కీలక పాత్ర పోషించారు. అయితే వారు అవినీతికి పాల్పడ్డారని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్లను వేరే డిపార్ట్ మెంట్లలో సర్దుబాటు చేసింది.