వారిని వెంటనే విధుల్లోకి తీసుకోండి.. ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్

Byline :  Vijay Kumar
Update: 2024-01-31 11:05 GMT

సింగరేణిలో ఇటీవల ఎంపికైన 146 మంది జూనియర్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతేడాది చివరిలో హైకోర్టు ఆదేశాలతో సింగరేణి 146 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసిందని అన్నారు. వాళ్లకు 2023 డిసెంబర్ 11న కౌన్సిలింగ్ నిర్వహించి 2023 డిసెంబర్ 18న విధుల్లోకి తీసుకుందని అన్నారు. అయితే 2023 డిసెంబర్ 19న జరిగిన సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కోడ్ పేరుతో వారిని మరుసటి రోజు నుంచి విధుల్లోకి రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. డిసెంబర్ 27న ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ఇంత వరకు వాళ్లను విధుల్లోకి తీసుకోలేదని అన్నారు.

రైల్వే, బ్యాంక్, కోర్టు, గ్రామ పంచాయతీ ఉద్యోగాలను సైతం వదిలి ఎంతో సింగరేణి జాబ్ లో జాయిన్ అయ్యారని అన్నారు. కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను కూడా వదిలి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో చేరారని, కానీ విధుల్లోకి తీసుకోకపోవడంతో వారంతా మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో తన కార్యాచరణ ప్రారంభించింది అని చెబుతోందని, అదే నిజమైతే తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయం స్థానం ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతుందని అన్నారు. 

Tags:    

Similar News