ఆ జెడ్పీ చైర్ పర్సన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి.. ఆర్ఎస్ ప్రవీణ్
ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో జనరల్ కేటగిరీ వ్యక్తిని ఎలా జెడ్పీ చైర్మన్ గా ఎంపిగా చేస్తారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కొమురం భీమ్ ఆసిఫాభాద్ జెడ్పీ చైర్ పర్సన్ గా గెలిచిన కోవా లక్ష్మి ఇటీవల ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావును తాత్కాలిక చైర్మన్ గా ఎంపిక చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎస్టీ (మహిళ)కు కేటాయించిన స్థానంలో జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని మండిపడ్డారు.
ఆదివాసీలకు దక్కిన రాజ్యాంగ హక్కులను ఆధిపత్య వర్గాలు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ప్రతిచోటా చేస్తున్నారని అన్నారు. అందుకు కోనేరు కృష్ణారావు ఎంపికే నిదర్శనమని అన్నారు. ఎటువంటి కాలయాపన చేయకుండా తక్షణమే ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించి మరో ఎస్టీ (మహిళ)ను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారంగా ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.