ముగిసిన మేడారం జాతర.. ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ ప్రశంసలు

Byline :  Vijay Kumar
Update: 2024-02-25 14:46 GMT

నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతర నిన్న ముగిసిన విషయం తెలిసిందే. కాగా మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులను టీఎస్ఆర్టీసీ తరలించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసిందని, లక్షలాది మంది భక్తులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారని అన్నారు. మొక్కులు చెల్లించుకొని బస్సుల్లో తిరిగి క్షేమంగా తమ సొంతూళ్లకు చేరుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు వచ్చే భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీంను జాతరలో సిబ్బంది విజయవంతంగా అమలుచేశామని పేర్కొన్నారు. ఈ జాతరలో ప్రతి ఒక్క సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తించి ఉన్నతస్థాయి వృత్తి నైపుణ్యాన్ని కనబరిచారని అన్నారు. లక్షలాది మంది భక్తులను జాతరకు చేర్చే కీలకమైన, సంక్లిష్టమైన పనిని సమిష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. తమ ప్రయాణ సమయంలో భక్తులు టీఎస్ఆర్టీసీ సిబ్బందికి ఎంతగానో సహకరించారని అన్నారు. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తున్నామని మరోసారి నిరూపించారని అన్నారు. మేడారం మహాజాతరలో టీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకుని సిబ్బందికి సహకరించిన భక్తులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.



Tags:    

Similar News