ఓవర్ లోడ్ వల్ల బస్సు ప్రమాదం జరగలేదు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Byline :  Vijay Kumar
Update: 2023-12-24 14:30 GMT

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హుజురాబాద్‌-హన్మకొండ రూట్‌ లో వెళ్తున్న TS02UC5936 నంబర్‌ గల ఆ బస్సు.. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు. కాగా ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారని, ఓవర్ లోడింగ్ వల్లే ప్రమాదం జరిగిందనేది అవాస్తవం అని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సుల్లో 42 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 40 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తెలిపిన ఆయన.. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు.

ఇక ప్రమాదంపై విచారణకు జరిపి..పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అద్దె బస్సుల నిర్వహణ విషయంలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తరచూ తనిఖీలు చేస్తూ.. తమ బస్సులను ఎప్పుడూ ఫిట్‌ గా ఉంచుకోవాలని సూచించారు. బస్సుల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా పూర్థి సామర్థ్యంతో బస్సులను నడపాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు.

Tags:    

Similar News