తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు అవుతున్న తరుణంలో బస్సులలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్ పై ఫోకస్ పెట్టిన టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులలో రద్దీ తగ్గించడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య 20 లక్షలకు చేరింది. ఒకప్పుడు ఆర్టీసీ బస్సులలో 11 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు. ఇక సిటీలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉదయం ఉద్యోగాలకు, కళాశాలలకు వెళ్లే వారితో సిటీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో బస్సుల్లో సీటింగ్ ఇబ్బంది కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలోనే బస్సులలో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని భావించి సరికొత్త నిర్ణయం తీసుకుంది టీఎస్ఆర్టీసీ. గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న బస్సులలో కొన్ని సీట్లు తొలగించి వాటి స్థానంలో రెండు వైపులా మెట్రో రైలులో ఉన్నట్టుగా సీటింగ్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మధ్యలో ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి ఎక్కువమంది ప్రయాణించటానికి వెసులుబాటుగా ఉంటుందని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. తాజాగా టీఎస్ఆర్టీసీఅలాంటి బస్సుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఇక మెట్రో ట్రైన్ లా ఉన్న ఈ బస్సుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.