మీ పాలనలో మైనారిటీలకు ఏం చేశారు?: కేటీఆర్కు షబ్బీర్ అలీ సూటి ప్రశ్న
కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మోసం చేసిందంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఖండించారు. గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా కేసీఆర్ కామారెడ్డి నుంచే ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. తనను ఓడించేందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చారన్న షబ్బీర్ అలీ.. మైనారిటీలపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ ఇదేనా అని అన్నారు. కేసీఆర్ రావడం వల్లే తాను నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయానని అన్నారు. మైనారిటీనైనా తన మీద పోటీ చేశారు కాబట్టే కేసీఆర్ జీవితంలో మొదటిసారి ఓడిపోయారని అన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఉర్దూ కాలేజీలు, పాఠశాలలు, లైబ్రరీలు మూతపడ్డాయని ఆరోపించారు.
రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క యూనివర్సిటీకైనా మైనారిటీ వీసీని పెట్టారా అని అడిగారు. టీఎస్పీఎస్సీలో ఒక్క మైనారిటీకైనా సభ్యునిగా అవకాశమిచ్చారా అని అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో అలా ఉండదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. రాష్ట్ర సలహాదారుడిగా నియమిస్తూ కేబినేట్ హోదా కల్పించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే ఇమ్రాన్ అనే వ్యక్తిని అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా నియమించామని తెలిపారు. అలాగే టీఎస్పీఎస్సీ లో అమరుల్లా అనే మాజీ ఐఏఎస్ అధికారిని మెంబర్ గా అపాయింట్ చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏం చేసినా మైనారిటీలకు తగిన ప్రాధాన్యం, అవకాశం ఉంటుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.