ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న సెలవు దినంగా ప్రకటించాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అసెంబ్లీలో కోరారు. సేవాలాల్ జయంతికి ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించినట్లే శివాజీ మహరాజ్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు శివాజీని గొప్పగా ఆరాధించేవారున్నారని, అవిభాజ్య భారతదేశాన్ని శివాజీ పరిపాలించారని గుర్తు చేశారు. విదేశీయుల దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడారని అన్నారు. కాబట్టి ఫిబ్రవరి 19న ప్రభుత్వ ఉద్యోగులకు క్యాజువల్ లీవ్, విద్యాసంస్థలకు సాధారణ సెలవు ప్రకటించాలని కోరారు. కాగా బంజారా కులస్తుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. ఆ రోజు జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించింది. సేవాలాల్ జయంతి వేడుకలకు రూ. 2 కోట్లు ప్రకటించింది. ఆ రోజున సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గిరిజన ప్రజలకు ఎన్నో మార్గదర్శకాలు చూపిన గొప్ప వ్యక్తి సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి పరిచయం చేసిన మహానీయుడని అన్నారు.