రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్!
రేషన్ కార్డులేని వాళ్లకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులేని వాళ్ల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని, అందుకోసం మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునేందుకు వీలైనంత త్వరగా ఆన్లైన్ ప్రక్రియను మొదలుపెట్టాలని, దరఖాస్తుల స్వీకరణను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజా పాలన పేరుతో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు పలు పథకాలకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 10 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయి. అందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి.
అయితే ప్రతి పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో రేషన్ కార్డులేని వాళ్లు అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డులేని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాళ్లకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డు వచ్చాక ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఇక ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది.