MLA Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక విడుదల
(MLA Lasya Nanditha) కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరులోని అమేధ హాస్పిటల్ కు తరలించగా.. ఆమె పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక విడుదల చేశారు డాక్టర్లు. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడంతో తలకు బలమైన గాయాలు అవ్వడం వల్ల లాస్య నందిత స్పాట్‌లోనే మరణించిందని వైద్యులు తెలిపారు. తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయని, ఒక కాలు విరిగిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని డాక్టర్లు వెల్లడించారు. దివంగత నేత సాయన్న కుమార్తె అయిన లాస్య నందిత తండ్రి అడుగుజాడల్లోనే ఇటీవల కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఎమ్మెల్యేగా గెలుపొందాక రెండు సార్లు ప్రమాదం ఆమెను వెంటాడింది. గతేడాది డిసెంబర్ లో సికింద్రాబాద్ లో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య లిఫ్ట్ లో ఇరుక్కుపోయి చాలా ఇబందిపడిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల నల్గొండలో కేసీఆర్ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఎమ్మెల్యేగా గెలిచాక ఇలా రెండు సార్లు ప్రమాదం నుంచి బయటపట్ట లాస్య నందిత ఇవాళ జరిగిన ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. కాగా లాస్య పార్థివ దేహాన్ని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. ఇక లాస్య మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు తమ సంతాపం తెలిపారు.