గ్రంథాలయ సంస్థల చైర్మన్ల తొలగింపు

Byline :  Vijay Kumar
Update: 2024-01-05 09:27 GMT

ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పూర్తి దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇక గత ప్రభుత్వంలో నియామకమైన పలు కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించింది. తాజాగా రాష్ట్రంలోని 33 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమై గత ప్రభుత్వ హయాంలో ఎన్నికైన గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యులను తొలగిస్తున్నట్లు, పాత కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇక కొత్త చైర్మన్లు, సభ్యుల నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామని సీఎస్ స్పష్టం చేశారు. కాగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ మొత్తం రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక ఈ సంక్రాంతి నుంచి మహిళకు రూ.2500 సాయం పథకాన్ని ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News