Dubai Jail : దుబాయి బాధితుల విముక్తి క్రెడిట్ తమదేనన్న బీజేపీ.. బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్

Byline :  Vijay Kumar
Update: 2024-02-23 12:22 GMT

పొట్టకూటి కోసం దుబాయి పోయిన కొందరు తెలంగాణ యువకులు పలు కేసుల్లో ఇరుక్కొని అక్కడ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. కుటుంబానికి దూరంగా దాదాపు 18 ఏళ్లు అక్కడ నరకయాతన అనుభవించారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇటీవల సొంత గడ్డ తెలంగాణకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. 18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో దుబాయి బాధితుల కుటుంబాల్లో ఆనందం వెల్లువెరిసింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియాలో ఆ వీడియోను పంచుకున్నది. ప్రధాని మోడీ నాయకత్వంలో విదేశాంక మంత్రి డాక్టర్ జై శంకర్ దౌత్యం వల్ల దుబాయ్ లో 18 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన మల్లేశం, రవి, హన్మంతు, లక్ష్మణ్, వెంకటేశ్ విముక్తి పొందారు అని పేర్కొంది. ఈ క్రమంలోనే తెలంగాణకు చేరుకున్నాక వాళ్ల కుటుంబ సభ్యులను చూసి ఎమోషనల్ అయ్యారంటూ తెలిపింది.

కాగా బీజేపీ ఈ ట్వీట్ పై బీఆర్ఎస్ మండిపడింది. గత పన్నెండేళ్లుగా ఆ తెలంగాణ వాసులను దుబాయ్ జైలు నుండి విడుదల చేయించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతో కష్టపడ్డారని ఎక్స్ వేదికగా పేర్కొంది. వారి కేసును దగ్గరుండి కేటీఆర్ పర్యవేక్షించారని తెలిపింది. వారి విడుదల కోసం కేటీఆర్ ఎన్నో సార్లు యూఏఈ ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపులు జరిపారని తెలిపింది. దాని ఫలితంగా 18 ఏళ్ల తర్వాత వారికి విముక్తి లభించిందని పేర్కొంది. కానీ ఈ విషయంలో బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తూ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది. ఇలాంటి విషయాల్లో కూడా మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలని చెప్పుకోవడానికి కొంచమైనా సిగ్గుండాలి అంటూ బీజేపీపై ఘాటుగా విమర్శలు చేసింది. ఎవరి కృషి వల్ల వారు విడుదల అయ్యారో వారి కుటుంబ సభ్యుల మాటల్లో వినండంటూ బీఆర్ఎస్ ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశారు. 




Tags:    

Similar News