బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా విజయం మాదే.. JaggaReddy
బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. మేడగడ్డ విషయంలో బీఆర్ఎస్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. మేడిగడ్డ గురించి తాము ప్రజలకు వివరించాం కాబట్టే అది తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు పోటీగా మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నారని అన్నారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు గోదావరిలో పోసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. పైగా తామేం తప్పు చేయలేదన్నట్లు మళ్లీ మేడిగడ్డ యాత్రకు వెళ్తామనడం సిగ్గు చేటు అని అన్నారు. తాము అధికారంలోకి రాకముందే తమ నాయకుడు రాహుల్ గాంధీ మేడిగడ్డను సందర్శించారని, అధికారంలోకి రాగానే మేడిగడ్డ ను సందర్శించి జరిగిన తప్పుల గురించి ప్రజలకు చెబుతామని అన్నామని గుర్తు చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన డైరెక్షన్ మేరకు తాము పని చేస్తున్నామని అన్నారు.
ట్యాక్స్ ల రూపంలో వచ్చిన డబ్బును పథకాల ద్వారా అందించడమే ప్రభుత్వం పని అని అన్నారు. తమ ప్రభుత్వం ఈ మేరకే పని చేస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను శ్వేత పత్రం ద్వారా అసెంబ్లీలో విడుదల చేశామని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మేడగడ్డకు ఏం పీకడానికి వెళ్తున్నారని అనడం కరెక్ట్ కాదని అన్నారు. తమ మంత్రి వర్గంలో కేసీఆర్ కంటే కూడా చాలా చిన్న వయసు ఉన్నవాళ్లు ఉన్నారని, వాళ్లు కూడా కేసీఆర్ లాగే మాట్లాడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అనుకున్న సమయానికే తాము ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఇక రానున్న ఎంపీ ఎన్నికల్లో తాము 17 స్థానాలు గెలుచుకుంటామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.