న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ సంస్థను ఆదరిస్తున్న ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు.హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ప్రయాణికులు, సిబ్బందితో కలిసి సజ్జనార్ కేక్ కటింగ్ చేశారు. అనంతరం స్వాతి, నారాయణ, మల్లేష్, గోపాల్ రెడ్డి, షాబుద్దిన్ అనే ప్రయాణికులను శాలువాలు కప్పి సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం ప్రయాణికులు సంస్థను బాగా ఆదరించారని గుర్తుచేస్తూ.. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రయాణికుల ఆదరాభిమానాలు సంస్థపై ఉండాలని కోరారు. ఈ కొత్త ఏడాదిలో సంస్థకు మంచి ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలవుతోందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు దాదాపు 6.60 కోట్లకు పైగా మహిళలను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. ఈ స్కీం ప్రకటించిన 48 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశామని, సిబ్బంది సహకారం వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణకు నిదర్శనమనే విషయాన్ని మహాలక్ష్మీ స్కీం అమలుతో మరో సారి నిరూపించారని అన్నారు. మహాలక్ష్మి స్కీంను ప్రశాంతంగా అమలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంస్థను అభినందించారని చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
టీఎస్ఆర్టీసీకి ప్రయాణికులు, సిబ్బంది రెండు కండ్లలాంటి వారని అన్నారు. ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని పేర్కొన్నారు. త్వరలోనే మిగతా బకాయిలను చెల్లిస్తామని, వాటి విషయంలో సిబ్బంది ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. విడతల వారిగా ప్రయాణికులకు కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేసిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డా.రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, సీఎంఈ రఘునాథ రావు, సీఈఐటీ రాజ శేఖర్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, తదితర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.