TSRTC MD Sajjanar : ఉచిత ప్రయాణంపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర మహిళకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణంపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జానార్ మీడియాకు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని అన్నారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని క్లారిటీ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్లలో ఫోటోలు, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చెల్లవని అన్నారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ తప్పక తీసుకోవాలని కోరారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందన్న ఆయన.. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకోవాలని కోరారు. ఉచితమే కదా జీరో టికెట్లు తీసుకోవడం ఎందుకని కొందరూ మహిళలు వాదిస్తున్నారని, కానీ జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకీ ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500 ఫైన్ విధిస్తామని సజ్జనార్ తెలిపారు.