బీజేపీలో చేరండి.. బీఆర్ఎస్ నేతలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రిక్వెస్ట్
తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలో చేరాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా.. గెలవకపోయినా తెలంగాణకు వచ్చేది ఏం లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి బయటకు రావాలని బీఆర్ఎస్ నేతలను కోరారు. కేసీఆర్ కుటుంబానికి ఇంకెన్నాళ్లు బానిసలుగా ఉంటారని ప్రశ్నించారు. దేశ గౌరవం కోసం.. దేశ అభివృద్ధి కోసం బీజేపీలో చేరాలని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఎన్నికలకు ముందే దేశ ప్రజలు మరోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
కేంద్రంలోని ఎన్డేఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కూటములు వచ్చినా ఏం చేయలేవని అన్నారు. విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని.. ఆ కుంభకోణాల వల్లే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరం అయిందని విమర్శించారు. కాంగ్రెస్ అవినీతిపై విసిగి పోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. సమర్థవంతంగా కరోనాను మోడీ ఆధ్వర్యంలో ఎదుర్కొన్నామని చెప్పారు. స్వయంగా ప్రధాని వచ్చి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను సందర్శించి వారికి ధైర్యం ఇచ్చారన్నారు. మోడీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా మోడీ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో కనీసం రోడ్లు కూడా ఉండేవి కావని.. ఇప్పుడు పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. మూడోసారి కూడా దేశానికి ప్రధాని మోడీయేనని ధీమా వ్యక్తం చేశారు.