ఆయన అరెస్ట్ను స్వాగతిస్తున్నాం.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
టీఎస్ఆర్టీసీకి ప్రకటనల ద్వారా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ అరెస్ట్ ను స్వాగతిస్తున్నామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ తమ సంస్థకు రూ.21.73 కోట్లు చెల్లించకుండా మోసం చేశారని, అందుకే తాము పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015 సెప్టెంబర్ లో టీఎస్ఆర్టీసీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు సంవత్సరాలకు గాను 2021 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదు. హైదరాబాద్ రీజియన్ లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రూ.10.98 కోట్లు బకాయిలున్నాయి.
టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ బకాయిలపై సమీక్ష జరిపారు. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీకి పలుమార్లు లీగల్ నోటీసులను సంస్థ జారీ చేసింది. ఆ నోటీసులకు స్పందించిన యాడ్ ఏజెన్సీ.. రూ.55 లక్షలకు ఇచ్చిన చెక్ లకు ఇచ్చింది. అవి చెల్లలేదు. ఈ మోసంపై అప్జల్ గంజ్, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ కు బదిలీ అయింది. విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఫీజులను ఎగవేసే సంస్థలపై నిబంధనల మేరకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని, బకాయిలు చెల్లించకుండా మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.